అంగరంగ వైభవంగా మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం
వేద మంత్రాలు, చండీ పారాయణాలు, సంప్రదాయ యాగశాలలు, వేళతాళాలు, భక్తి పరిమణాల మధ్య మూడో రోజు మహారుద్ర సహిత సహస్ర చండీయాగం అంగరంగ వైభవంగా కొనసాగింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఈ యాగానికి మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు ప్రముఖులు ఎక్కువగా తరలి రావడంతో సందడి నెలకొంది. ఉదయం ఎనిమిది గంటల నుంచే సీఎం కేసీఆర్ దంపతులు, కోడలు శైలిమ, కుమార్తె- అల్లుడు ఎంపీ కవిత, అనిల్, ఎంపీ సంతోష్‌కుమార్, ఇతర కుటుంబసభ్యులతో కలిసి పూజాల్లో పాల్గొన్నారు. మొదట రాజశ్యామల మండపానికి చేరుకొని అమ్మవారికి అర్చన చేశారు. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ పూజలతోపాటు చతుర్వేద పారాయణ మండపంలో పూజలు చేశారు. సహస్ర చండీ పారాయణ మంటపంలో చండీ మాతకు సీఎం అభిషేకం నిర్వహించారు. మహారుద్ర మండపంలో హవనంలో పాల్గొని రుద్రాన్ని ఆలకించారు. మూడో రోజు కూడా సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు దంపతీ, కుమారి పూజలను నిర్వహించారు.













