ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్య్ర సంగ్రామం మహోజ్వల ఘట్టం : కేసీఆర్
ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్య్ర పోరాటం మహోజ్వల ఘట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కొనియాడారు. భారత స్వాతంత్య్ర చరిత్రను గాంధీ ప్రవేశించకంటే ముందు, గాంధీ ప్రవేశించిన తర్వాత అన్న విశ్లేషణాత్మక కోణంలో చూడాల్సి ఉంటుందని అన్నారు. ఆయన కంటే ముందు కూడా స్వతంత్ర్య పోరాటం జరిగిందని, కానీ గాంధీ పూర్తి స్థాయిలో ఉద్యమ నేతృత్వం వహించిన తర్వాతే అద్భుతమైన ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయని పేర్కొన్నారు. గాంధీ ఎంచుకున్నది అహింసా పంథా అని, అందుకే ఆయనతో పాటు ఉండేవారు చాలా సంశయాత్మకంగా ఉండేవారని గుర్తు చేశారు. అయినా సరే స్వాతంత్య్రాన్ని అహింసాయుత మార్గంలోనే సంపాదించుకోవాలన్నది గాంధీజీ అభిలాషగా ఉండేదని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏడాది పాటు ‘ఆజాదీకా అమృత్ ఉత్సవ్’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… గాంధీజీ చేపట్టిన అహింసాయుత మార్గంలోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. మానవ హక్కుల కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు కూడా గాంధీజీ మార్గదర్శకాలు ప్రేరణగా నిలిచాయన్నారు. యావత్ ప్రపంచానికే మన భారత స్వతంత్ర్య సమర స్ఫూర్తి ఓ ఆదర్శంగా నిలిచిందన్నారు. బ్రిటీష్ వారు తెచ్చిన ఉప్పు చట్టం దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిందన్న విషయాన్ని గాంధీజీ గ్రహించి, 1930 మార్చి 12న ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా దండి వరకూ గాంధీ పాదయాత్ర చేసి, చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని గాంధీ డిమాండ్ చేశారని తెలిపారు. ఈ దండి యాత్రలో వేలాది మంది పాల్గొన్నారని, అరేబియా సముద్రం తీరాన ఉన్న పిడికెడు ఉప్పును చేతిలో పట్టి, గాంధీ సింహంలా గర్జించారని కొనియాడారు.
గాంధీ చేపట్టిన ఈ దండియాత్రలో హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు పాల్గొన్నారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అహింసా పద్ధతిలోనే, శాంతియుతంగా గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారని, ఆ పద్ధతిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సిద్ధించుకున్నామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో 75 వారాల పాటు ఈ అమృత్ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తామని, దీనికి అధ్యక్షులుగా ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి నియమించామని తెలిపారు. ఈ వేడుకల కోసం 25 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సీఎం తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను గవర్నర్ తమిళిసై వరంగల్‌లో ప్రారంభించారని, అందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామని కేసీఆర్ అన్నారు.













