ఖమ్మం కష్టమేనా..?
ఖమ్మంలో గులాబీకి కష్టకాలం దాపురించిందా? దిగ్గజ నేతలు ఒకొక్కరుగా పార్టీని వీడి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కారుకు గుడ్ బై చెప్పి, హస్తం గూటికి చేరారు. అంతేనా ఖమ్మంలో గులాబీ జెండా ఎగరనీయనని ప్రతినబూనారు. తన అనుచరులను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని… ఇలాంటి వాటికి బెదిరేది లేదన్నారు. అంతేకాదు… మొత్తం సీట్లన్నింటిలోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందన్నారు.
ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వంతు వచ్చింది. బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో తనకు టికెట్ రాకపోవడంతో తుమ్మల తీవ్ర అసంతృప్తి చెందారు. అనుచరులతో సుదీర్ఘ మంతనాల తర్వాత తుమ్మల తాను రాజకీయాల్లో ఉంటాానని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఖమ్మం ప్రజలు తనను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి పెద్దసంఖ్యలో కార్లతో ర్యాలీ తీసి.. తుమ్మల తన బలమెంతో, గులాబీ దళానికి చాటి చెప్పారు.
ఓవైపు పొంగులేటి… బీఆర్ఎస్ పై కత్తులు నూరుతున్నారు.మరోవైపు… తుమ్మల సైతం తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఈపరిణామం… సహజంగానే గులాబీదళానికి సంకటంలా మారింది. తుమ్మల పెద్దఎత్తున ర్యాలీ తీయడం, అభిమానులు తరలిరావడంతో.. గులాబీదళం అప్రమత్తమైంది. ఖమ్మం బీఆర్ఎస్ నేతలతో గులాబీ హైకమాండ్ సంప్రదింపులు జరుపుతోంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న అంశంపై పెద్దఎత్తున చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు కేవలం పువ్వాడ, జలగం వర్గాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. వీరు ఎంతవరకూ పార్టీని ముందుండి నడిపిస్తారన్న దానిపైనే బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కేసీఆర్ చరిష్మా.. ఖమ్మంపై పెద్దగా పనిచేయదని వాదనలున్నాయి. అదేవిధంగా ఎన్నికల్లో ఫలితాల సరళి కూడా ఇదే విషయాన్ని రుజువుచేేశాయి. దీంతో గులాబీకి ఈసారి కష్టమన్న వాదనలు వినిపిస్తున్నాయి.













