ప్రగతి భవన్లో భారీ సమావేశం.. ముందస్తు ఎన్నికలపై క్లారిటీ
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పక వస్తాయని, కేసీఆర్ కూడా అందుకే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు అనేకం వస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కూడా ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి. కాకాపోతే ఈ మేరకు ప్రకటన చేసేందుకు కేసీఆర్ సరైన సమయం కోసం చూస్తున్నారని అనేక ఊహాగానాలు రాష్ట్రవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే మంగళవారం ఈ వార్తలకు కేసీఆర్ ఫుల్స్టాప్ పెట్టారు. ముందస్తు ఎన్నికల విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. మంగళవారం ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన భారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు. అంతేకాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే తనకు లేదని, సమయం ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టతనిచ్చారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలు ఇక ఏడాది మాత్రమే సమయం ఉన్న కారణంగా ప్రతి నేత తమ తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ అక్కడ ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి సారించాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దాంతో పాటుగా ప్రజల కష్టసుఖాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, వారి సమస్యలను పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని తెలిపారు.













