ఉదయం 10:10 తర్వాత ఎవరూ కనిపించొద్దు : సీఎం కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవిన్యూను కూడా లెక్క చేయకుండా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ ఇతర ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఉదయం 10:10 తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించొద్దని స్పష్టం చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ లాక్‌డౌన్‌ను పర్యవేక్షించాలని, 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు లాక్‌డౌన్‌ను స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. వారం పది రోజుల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వరంగల్ సెంట్రల్ జైలును మరో చోటకు తరలించి, ఓపెన్ జైలుగా మారుస్తామని, సెంట్రల్ జైల్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.