ఆ ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్.. ఇంకోసారి చేస్తే పార్టీ నుంచి తప్పిస్తాం : కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దళితబంధుపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉంది. ఆ ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తప్పిస్తాం.
అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత. రెండు పడక గదుల ఇళ్ల విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయి అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా పార్టీ కోసం కలిసి పనిచేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సీనియర్ నేత కడియం శ్రీహరికి సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్యల ఉన్న అధిష్ఠానంతో చెప్పాలన్నారు. ఎన్నికలే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.













