భూముల ‘డిజిటల్ సర్వే’ కు సన్నద్ధమైన సీఎం కేసీఆర్

తెలంగాణలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలని సూచించారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నుంచి ఎంపిక చేయాలని సూచించారు. మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఎంపిక చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ‘డిజిటల్ సర్వే నిర్వహణ’ అంశాపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… పేదల భూమి హక్కుల రక్షణ కోసమే ధరణి తెచ్చామని, భూ తగాదాలు లేని భవిష్యత్ తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వేకు సన్నద్ధమైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను గుర్తించి, తద్వారా పట్టాదారుల భూములలకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలన్నదే తమ ఉద్దేశమని సీఎం వివరించారు. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే తమ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్థవంతంగా చేపట్టి, ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని డిజిటల్ సర్వే ఏజెన్సీలకు సీఎం సూచించారు.
తగాదాల్లోని గ్రామాల్లోనే ముందు చేయండి : సీఎం
పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆ తర్వాత అటవీ భూములు, ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాల్లో, అంటే సమస్యలు లేని, సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇలా చేసి, క్షేత్ర స్థాయిలో వచ్చిన అనుభవాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. ఇలా చేస్తే పూర్తి స్థాయి సర్వేకు విధి విధానాలను ఖరారు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ముందుగా వ్యవసాయ భూములని, ఆ తర్వాత పట్టణ భూములను సర్వే చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో తగాదాలు లేనివిధంగా ఇప్పటికే ధరని పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ వ్యవహారాలు చక్కబడిన నేపథ్యంలో డిజిటల్ సర్వే నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
తేడా వస్తే… చర్యలు తథ్యం : కేసీఆర్
రైతుల భూముల్లో ఇంచు కూడా అటూ ఇటూ తేడా రాకుండా సరైన కొలతలు వచ్చేలా చూడాలని కోరారు. ఇందు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సర్వే చేపట్టాలని వారికి సూచించారు. తేడాలు రాకుండా సర్వే చేయాల్సిన బాధ్యత సర్వే ఏజెన్సీలదేనని, ఏమాత్రం అలసత్వం వహించినా, తప్పులకు తావిచ్చినా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అందుకు ఏమాత్రం వెనకాడమని కేసీఆర్ తేల్చి చెప్పారు. గ్రామాల్లో సంప్రదాయకంగా కొనసాగుతూ వస్తున్న భూ సర్వే విధానంలో అవలంబిస్తున్న టీపన్ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకొని సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ ప్రజలతో గ్రామ సభలను నిర్వహించి, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, సర్వే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. భవిష్యత్ తరాలకు భూతగాదాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నదే తమ అభిమతమని, అందుకే డిజిటల్ సర్వేకు పూనుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.