యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లబోతున్న యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేవి కాబట్టి ఎలాంటి తొందర పాటు ఆతృత అవసరంలేదని, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతాప్రమాణాలతో, అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరుగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టం చేశారు. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కుచెదరకుండా నిర్మాణాలు ఉండాలని చెప్పారు. పనులు పూర్తయ్యాక యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అద్భుతమైన దివ్వక్షేత్రంగా భక్తులకు సాక్షాత్కారం అవుతుందని అన్నారు. వివిధశాఖల అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ ఆరున్నరగంటపాలు యాదాద్రిలో పర్యటించారు. మొదట శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బాలాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారి గర్భగుడికి ముఖ్యమంత్రిని తీసుకెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.













