ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన కేసీఆర్.. వారం రోజులు అక్కడే మకాం!
టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటిస్తూ.. దాని పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా ప్రకటించిన తర్వాత తొలిసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఇక్కడ బీఆర్ఎస్ కోసం సిద్ధం అవుతోన్న కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యాలయంలో జరుగుతున్న మార్పులపై పలు సూచనలు చేశారు. ఈ వారాంతం వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. ఈ సమయంలో పలు పార్టీల నేతలతో జాతీయ రాజకీయాలపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం జోద్పూర్ వంశీయులకు చెందిన బంగ్లాను లీజుకు కూడా తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముందుగా యూపీ వెళ్లిన కేసీఆర్.. స్వర్గస్తులైన యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సమయంలో సీఎంతోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ నేత శ్రవణ్‌కుమార్ ఉన్నారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు.













