నూతన సచివాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి వెళ్లారు. సచివాలయ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. రాష్ట్ర సచివాలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు మూడు వేల మంది కార్మికులు మూడు షిప్టుల్లో పనులు చేస్తున్నారు. ప్రస్తుతం సచివాలయం పైభాగాన డోమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. డోమ్‌ల కాంట్రీక్ పనులు పది రోజుల్లో పూర్తి కానున్నాయి. అలాగే సచివాయలం భవనం లోపల అన్ని రకాల పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. సచివాలయం వెనక భాగంలో గుడి కోసం 1500 గజాల్లో, చర్చి కోసం 500 గజాల్లో మసీదు కోసం 1500 గజాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి కూడా 90 శాతానికిపైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కల్లా కొత్త సచివాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. రోడ్లు భవనాల శాఖ సచివాలయ పనులన్నింటిని పూర్తి చేసి జనవరిలో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు అప్పగించనుంది. అయితే కొత్త సెక్రటేరియట్ నుంచి పరిపాలన ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై సీఎం కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.













