అబ్బురపరిచేలా తెలంగాణ సెక్రటేరియట్
తెలంగాణలో మరో మహోజ్వల ఘట్టం సాక్షాత్కరించింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆధునిక హంగులతో.. దేశంలోనే తొలి పర్యావరణ హితంగా నిర్మించిన డా.బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యంగా నూతన సచివాలయం నిలిచింది. సచివాలయం ప్రారంభవేళ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సందడి నెలకొంది. సాగర్‌లో సెక్రటేరియట్ నమూనాతో భగీరథ బోటు ..సందర్శకులను కనువిందు చేసింది. రాత్రి వేళ..ఆకాశంలో బాణాసంచా మిరుమిట్లు గొలిపితే.. రంగురంగుల విద్యుద్దీపాల కాంతులతో పాలనా సౌధం దేదీప్యమానంగా వెలిగిపోయి.. వీక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదు.
‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయ’ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ అమాత్యులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, అతిరథ మహారథుల సమక్షంలో, వందలాది వేదపండితుల వేదాశీర్వచనాల ప్రతిధ్వని నడుమ, పవిత్ర హోమ, ధూమ సన్నిధిలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ చాంబర్లలో ప్రవేశించారు. నూతన సచివాలయంలో కొత్త చాంబర్లో తొలిరోజు పలు ప్రజోపయోగ ఫైళ్ల మీద సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంగా తొమ్మిదేండ్లలో తెలంగాణ పయనాన్ని వివరిస్తూ, దశాబ్దాలపాటు దారిద్య్రాన్ని అనుభవించిన తెలంగాణ తొమ్మిదేండ్లలోనే సంపన్న రాష్ట్రంగా ఎలా అవతరించిందో వివరించి ఆకట్టుకున్నారు.
హైదరాబాద్‌లో శిఖరాయమానంగా నిలిచిన నూతన సచివాలయమే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యమన్నారు. నూతన సచివాలయాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా అని అంటూ, కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం రాష్ట్ర పునర్నిర్మాణమే. వలసలు వెళ్లిన పాలమూరు బిడ్డలు వెనక్కి రావడం పునర్నిర్మాణమే. ఆచరణాత్మక విధానాలతోనే 33 జిల్లాలను పునర్నిర్మించుకున్నాం. తప్పనిసరి పరిస్థితులలో కొన్నిచోట్ల నిర్మాణాలు కూలగొట్టి కట్టాం. పదేళ్లలో చిన్నపాటి అల్లర్లులేని శాంతిభద్రతలు నెలకొల్పాం అని సీఎం కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 33 జిల్లాలలో 33 కలెక్టరేట్లు, 33 పోలీస్ కార్యాలయాలు అక్కడి నుంచి వెలుగులీనుతున్న వెలుగు ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణమంటే, శాంతిభద్రతలను కంటికి రెప్పలా కాపాడుతూ దేశానికే మార్గదర్శకులుగా మారుతున్న తెలంగాణ పోలీసుల కృషే తెలంగాణ పునర్మిర్మాణం అంటే. మురికి కూపాలుగా ఉన్న నాటి పల్లెలు, పట్టణాలు కాంతులతో వెలుగులీనుతున్న తీరే పునర్నిర్మాణమంటే అని సీఎం కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణ గతిని, ప్రగతి వీచికలను నూతన సచివాలయం వేదికగా వెల్లడిరచారు. సచివాలయ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ మార్గంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అందరికీ జోహార్లు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నాం. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణమన్నారు.
ప్రపంచ ఇంజనీరింగ్ అద్బుతాలు అనేలా అనేక ప్రాజెక్టులు కట్టుకున్నాం. కొత్త సచివాలయ ఆర్కిటెక్టులు, నిర్మాణ సంస్థకు, నిర్మాణంలో చెమట చిందించిన ప్రతీ శ్రామికుడికి ధన్యవాదాలు. తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు పేలారు. రాష్ట్రం మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారు. విమర్శలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇంజనీర్లు చేసిన అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తే పునర్నిర్మాణం అంటే ఏమిటో అర్ధమవుతుంది అని చెప్పారు. మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రజలు తాగే నీటిని ఆదిలాబాద్‌లోని గోడు ప్రజలు సైతం తాగుతున్నారని చెప్పారు. ప్రస్తుతం సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ ముందుకు వెళుతోందన్నారు. ఐటీలో బెంగళూరును అధిగమించి దూసుకుపోతోందన్నారు. ఐటీలో బెంగళూరును అధిగమించి దూసుకుపోతోందన్నారు. యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమేనన్నారు. ఇప్పుడు యాదాద్రి భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోందన్నారు. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందన్నారు. అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లతో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.
చాంబర్లలో కూర్చున్న మంత్రులు
నూతన సచివాలయ ప్రారంభం అనంతరం మంత్రులు వారికి కేటాయించిన చాంబర్లకు చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు.
* డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన ఫైలుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే. తారకరామారావు తొలి సంతకం చేశారు.
* రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ ఫైలుపై తొలి సంతకం. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం కింద రూ.151.64 కోట్ల నిధుల విడుదల ఫైలుకూ క్లియరెన్స్ ఇస్తూ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు సంతకం చేశారు.
* అంగన్వాడీలకు పోషకాలతో కూడిన సన్న బియ్యం పంపిణీ ఫైలుపై తొలి సంతకం. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల వార్షిక ప్రణాళికల ఫైలుపై మరో సంతకంను పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేశారు.
* ఉచిత చేపపిల్లల పంపిణీ ఫైలుపై తొలిసంతకం చేశారు. గొర్రెల పంపిణీ కోసం ఎన్సీడీసీ నిధుల విడుదల, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీ పనులకు రూ.75కోట్ల గ్రాంటు విడుదల ఫైళ్లకు ఆమోదముద్ర వేస్తూ పశుసంవర్థక, మత్య్స శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి సంతకం పెట్టారు.
* అంగన్వాడీల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సంపూర్ణ ఆహార పథ కానికి ఇకపై బలవర్ధక సన్నబియ్యంతో కూడిన ఆహారాన్ని అందించే ఫైలుపై గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తొలి సంతకం చేశారు.
* కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవ్వనున్న శ్రమశక్తి అవార్డుల ఫైలుపై కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి తొలి సంతకం పెట్టారు.
* దళితబంధు పథకం రెండో విడత లబ్దిదారుల ఎంపిక ఫైలుపై ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తొలి సంతకం.
* రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త మండలాల్లో ఐకేపీ భవన నిర్మాణాలకు సంబంధించిన ఫైల్‌పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొలి సంతకం చేశారు.
* గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషన రేట్లలో జోన్ల పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలీస్ స్టేషన్లలో పోస్టుల మంజూరు ఫైలుపై హోం మంత్రి మహమూద్ అలీ తొలి సంతకం పెట్టారు.
* ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.
* రైతులకు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ఫైలుపై తొలి సంతకం. అసెంబ్లీ నియోజకవర్గా ల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై వ్యవసాయ, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రెండో సంతకం పెట్టారు.
* రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైలుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తొలి సంతకం.
* జగదీశ్‌రెడ్డి (విద్యుత్ శాఖ): వ్యవసాయానికి రూ.958.33 కోట్ల విద్యుత్ రాయితీ విడుదల ఫైలుపై తొలి సంతకం చేశారు.
* దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో వంద ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైలుపై తొలి సంతకం. ప్రధాన దేవాలయాల్లో తృణధాన్యాలతో కూడిన ప్రసాదాన్ని అందుబాటు లోకి తెచ్చే ఫైలుపై రెండో సంతకం పెట్టారు.
* విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 19,800 మంది టీచర్లకు రూ. 34. 25 కోట్లతో ట్యాబ్‌లు అందజేసే ఫైలుపై తొలి సంతకం. 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్పాటు ఫైలుపై మరో సంతకం చేశారు.
* రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ కొత్త జిల్లాల్లో రవాణాశాఖ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం పెట్టారు.
సచివాలయం ప్రత్యేకతలు
సచివాలయంలో అంతస్థుల వారీగా విభాగాల వివరాలు
గ్రౌండ్ ఫ్లోర్: ఎస్సీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు
1వ అంతస్థు: ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖలు
2వ అంతస్థు: ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖలు
3వ అంతస్థు: మున్సిపల్, ఐటీ, ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ప్లానింగ్, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, వ్యవసాయం
4వ అంతస్థు: ఫారెస్ట్, లా, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, పౌర సరఫరాలు, యువజన సర్వీసులు-సాంస్కృతిక శాఖలు
5వ అంతస్థు: ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్థు: సీఎం, సీఎస్, సీఎంవో ఉన్నతాధికారులు, పీఆర్వో, సిబ్బంది కార్యాలయాలు
ప్రతిష్టాత్మక ఐజిబిసి గుర్తింపు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం.
విస్తీర్ణం వివరాలు
మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు
భవనం నిర్మించిన ఏరియా : 2.5 ఎకరాలు
ల్యాండ్ స్కేపింగ్ : 7.72 ఎకరాలు
సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్ : 2.2 ఎకరాలు
పార్కింగ్ : 560 కార్లు, 700ల బైక్‌లు
యాన్సిలరీ బిల్డింగ్ ఏరియా : 67,982 చ.అ.
ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా : 8,58,530 చ.అ.
లోయర్ గ్రౌండ్ ఆరు అంతస్థుల్లో
ఒకోదాని ఎత్తు : 14 అడుగులు
అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు
భవనం పొడవు, వెడల్పు : 600 x 300
ప్రధాన గుమ్మటాలు (స్కైలాంజ్) : 11వ అంతస్థు
జాతీయ చిహ్నం
ప్రధాన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ 4 సింహాల చిహ్నాలను ఏర్పాటుచేశారు. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే చిహ్నాలను ఢల్లీిలో తయారు చేయించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు
ఆరో అంతస్థులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌తో ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాచేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా క్యాబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.













