సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఇది .. ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన దినం ఇది. ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ విధానంలో 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. కానీ ఈ కార్యక్రమం చాలా ఆత్మసంతృప్తి కలిగే గొప్ప సన్నివేశం. ఎందుకంటే పరిపాలన చేతకాదు అని ఎగతాళి చేసిన పరిస్థితులను చూశాం. అటువంటి తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరంలో దాదాపు 24 వరకు చేరుకున్నాం. గతంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ ఆ సంఖ్య 26కు చేరింది. వచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు నూతనంగా ప్రారంభం కాబోతున్నాయి. వీటికి కేబినెట్ ఆమోదం కూడా లభించిందని తెలిపారు. 2014లో 2850 మెడికల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8515 మెడికల్ సీట్లు ఉన్నాయని తెలిపారు. వికారాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, జనగామ, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, భూపాలపల్లి మెడికల్ కాళాశాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో సహా పలువురు మంత్రులు, ఆయా జిల్లాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.













