కల్తీలపై ఉక్కుపాదం
రాష్ట్రంలో అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలని, కల్తీలకు పాల్పడే వారిపట్ల అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో కల్తీలు లేకుండా చేయడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోకపోతే కొత్త చట్టాలు తీసుకురావడానికైనా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని సిఎం వెల్లడించారు. ఆహార పదార్ధాల కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతున్నదని, కల్తీ విత్తనాల వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టి తీరాలని, దీనికోసం అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని సిఎం చెప్పారు. కల్తీలను నిర్ధారించడానికి ఎక్కువ సంఖ్యలో డి.ఎన్.ఎ. కిట్లు అందించాలని నిర్ణయించారు. కల్తీ ఆహార పదార్ధాలు, కల్తీ విత్తనాల నియంత్రణకు అవలంభించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతి భవన్లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ సుల్తానియా, మహేశ్ భగవత్, హైదరాబాద్ రేంజ్ ఐజి స్టీఫెన్ రవీంద్ర, వరంగల్ రేంజ్ ఐజి నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్, సెక్యూరిటీ ఐజి ఎన్.కె. సింగ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.













