సాగర్ ప్రచారానికి సీఎం కేసీఆర్ ‘ఫినిషింగ్ టచ్’
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. నల్లగొండ జిల్లా హాలియాలో జరిగే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ సభ ప్రారంభం అవుతుంది. హాలియాలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ప్రకటించినా… కరోనా నేపథ్యంలో అంత మంది హాజరవుతారా? అన్నది చూడాలి. అయితే కరోనా నియమావళికి తగ్గట్టుగానే టీఆర్ఎస్ సభా నిర్వహణను చేస్తోంది. సభకు హాజరయ్యే వారంతా విధిగా మాస్కులు ధరించాలన్న నిబంధన కచ్చితంగా అమలయ్యేలా చూడనున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం జరిమానా తథ్యమని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేవరకొండ, మిర్యాలగూడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించనున్నారు. మరో వైపు సాగర్ బరిలోకి కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యాన్నీ టీఆర్ఎస్ పదే పదే గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఉప ఎన్నిక అయినా సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరువుతున్నారు. ఇక తాను సీఎం సవాల్‌ను తప్పించి, ఇతరులెవ్వరి సవాల్‌ను స్వీకరించనని జానారెడ్డి ప్రకటనను కూడా సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.













