ప్రభాకర్ రెడ్డికి బీఫామ్ అందజేసిన కేసీఆర్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ కలిశారు. మునుగోడులో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రగతి భవన్ వచ్చిన ప్రభాకర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డికి బీ ఫామ్ అందజేసిన కేసీఆర్.. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఫండ్ నుంచి రూ. 40 లక్షల చెక్కును కూడా అందజేశారు. ఈ సందర్భంగా తనకు మునుగోడు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.













