ఈసారీ మనమే.. వాళ్లకి మళ్లీ వచ్చేది 20 సీట్లే : కేసీఆర్
దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ మంచినీరు ఇచ్చే ఏకైక రాష్ట్రం మనదేనని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే విజయాలు సొంతమవుతాయని అన్నారు. భట్టి విక్రమార్క మధిరను పట్టించుకోలేదు. ఆయనకు ఓటేస్తే నష్టమే జరుగుతుంది. చుట్టచూపుగా నియోజకవర్గానికి వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంది. దళిత వర్గం నుంచి ఒక్క ఓటు కూడా భట్టి విక్రమార్కకు పడకూడదు. బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజును గెలిపిస్తే మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తాం. కాంగ్రెస్లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు. వాళ్లకి మళ్లీ వచ్చేది 20 సీట్లే. బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతోంది. గతం కంటే మనికి ఇంకో రెండు సీట్లు ఎక్కువే వస్తాయి అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హయాంలో మధిరలో కరెంటు ఉండేదా? ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. రైతుబంధు ఇవ్వొద్దు. కరెంట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ అంటోంది. ధరణి స్థానంలో భూమాత పెడతారట. వాళ్లు పెట్టేది భూమాత కాదు, భూమేత. బీఆర్ఎస్ను గెలిపిస్తే పదేళ్ల నుంచి కొనసాగుతున్న అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటికే మోసం వస్తుంది అని అన్నారు.













