ప్రణబ్ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణతో ఎనలేని అనుబంధం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన మరణం తీరని లోటని, ప్రణబ్ ముఖర్జీ మృతికి నివాళిగా వారం పాటు రాష్ట్రంలో సంతాప దినాలు కేసీఆర్ ప్రకటించారు. వ్యక్తిగతంగా తన తరపున తెలంగాణ ప్రజల తరపున ప్రణబ్‌కు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని ప్రణబ్ భావించేవారు. నేను కలిసిన ప్రతిసారీ ఎన్నో విలువైన సూచనలు చేశారు. ఒక నాయకుడు ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుంది. ఆ ఘనత మీకు దక్కింది అంటూ నన్ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రణబ్ రాసిన ద కొయలేషన్ ఇయర్స్ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వారం పాటు టీఆర్ఎస్ కార్యక్రమాలు వద్దు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి నివాళిగా వారంపాటు పార్టీ కార్యక్రమాలేవీ నిర్వహించరాదని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖరరావు ఆదేశించారు. రాష్ట్రంలో వారంరోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నందున ఈ సమయంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.













