అదే జరిగితే మళ్లీ… మొదలవుతాయి : సీఎం కేసీఆర్
ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మి ఓటు వేయొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పోటీ చేస్తున్న వ్యక్తి, అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ, దాని చరిత్రను చూడాలని కోరారు. పార్టీ దృక్పథం చూసి వివేకంతో ఓటు వేయాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి రాలేదని అన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుబంధు దుబారా ఖర్చు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని చెబుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తివేస్తామంటున్నారు. అదే జరిగితే మళ్లీ పైరవీలు మొదలవుతాయి. రైతు బంధు, రైతుబీమా ఎలా వస్తాయి? రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌తో వ్యవసాయంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రైతులకు కరెంట్, నీళ్లు ఉచితంగా ఇస్తున్నాం. పెట్టుబడి సాయం ఇస్తున్నాం. చాలా కష్టపడి అన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం అని అన్నారు. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కనీసం ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని మోదీ సర్కార్ ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా వెనకబడి ఉన్న ఎస్సీలు బాగుపడాలనే దళితబంధు తీసుకొచ్చానని, ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని అన్నారు.













