మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్న సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్నకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్విచ్ఛాన్ చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కేసీఆర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ ప్రాజెక్టు 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు (తూములు) ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తుపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని అన్నారు. ఈ మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 58 వేలకు పైగా కార్మికులు పాల్గొన్నారని తెలిపారు. ఇది మల్లన్నసాగర్ కాదని, తెలంగాణ జనహృదయసాగరమని అన్నారు. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరమని తెలిపారు. ఒక్క సిద్దిపేట జిల్లాకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి సమస్యను దూరం చేసే గొప్ప ప్రాజెక్టు అన్నారు. మహానగరానికి దాహార్తిని తీర్చే మహత్తరమైన జల భాండాగారమన్నారు.













