ఇది తెలంగాణ మట్టి మనిషికి దక్కిన గౌరవం : సీఎం కేసీఆర్
ప్రముఖ ప్రజా కవి, శాసన మండలి సభ్యుడు గోరెటి వెంకన్నకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెలంగాణ మట్టి మనిషికి దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. ప్రముఖ కవి, జానపద గాయకుడు, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ సభ్యుడు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021 దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వల్లంకి తాళం అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలు సామాజిక తాత్వికతతో కండ్లకు కడతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సీఎం అన్నారు. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని మనిషికి, ఇతర జంతు పక్షి జీవాలకు ఉన్న అనుబంధాన్ని గోరెటి అత్యున్నతంగా ఆవిష్కరించారని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలకు తన సాహిత్యం ద్వారా వెంకన్న విశ్వవ్యాపితం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరెటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.













