జలవిహార్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రేపు (బుధవారం 17వ తేదీ) నగరంలోని జలవిహార్‌లో ఘనంగా జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలలో భాగంగా సీఎం కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్తానం, తెలంగాణ ఉద్యమ నేపధ్యంతో త్రీ డీ గ్రాఫిక్స్ తో రూపొందించిన 30 నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి 67వ జన్మదినం సందర్భంగా 67 కిలోల కేక్‌ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కట్ చేస్తారు.
అదేవిధంగా కాళేళ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను చాటిచెప్పే, కుల వృత్తులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, ప్రభుత్వ పథకాలను వివరించేలా రూపొందించిన పాటలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, నేతి విద్యాసాగర్, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తదితరుల చేతులమీదుగా విడుదల చేస్తారు. ఈ సందర్భంగా కళాకారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.













