దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం : సీఎం కేసీఆర్
ప్రజాసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ, రంగాల్లోనే దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతకాన్ని సీఎం ఎగురవేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ 8 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారామని అన్నారు. 2014`19 మధ్య 17.24 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థాయిలో నిలిచామన్నారు. మిషన్ భగీరథ పథకం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించే తొలి 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షా 35 వేల ఉద్యోగాలు భరీ చేశాం. మరో 90 వేలు భర్తీ చేస్తున్నాం. స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్నారు.
సమైక్య పాలనతో పోల్చితే అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. 75 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించని విజయాలను ఈ 8 ఏళ్లలో తెలంగాణ సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి నేటికీ ఉన్న స్థితిగతుల్లో పోలికే లేదన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తున్నాం. ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. దళితబంధు కోసం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించాం. ఈ పథకం ఎస్సీల జీబితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తుందన్నారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలు తెలంగాణకు గుదిబండగా మారాయి. అడుగడుగునా వివక్ష చూపిస్తోంది. రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలన్నారు. రాష్ట్రాల హక్కులను హరిచడాన్ని ఇకనైనా ఆపాలన్నారు. మీటర్ల విషయంలో రైతులపై భారం వేసేందుకు మేం సిద్ధంగా లేం. దేశంలో మతపిచ్చి తప్ప వేరే చర్చ లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దారిద్య్రం ఎందుకు ఉంది? వనరులను సరిగా వాడుకోలేని అసమర్థతకు బాధ్యులెవరు? దేశ సమస్యలు పరిష్కరించేందుకు ప్రగతిశీల అజెండాను కావాలి. ప్రజల జీవితాల్లో మౌలిక మార్పు తేవాలి. ఎన్నాళ్లు కులం, మతం అంటూ కొటుటకుంటాం? విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోంది అని కేసీఆర్ అన్నారు.













