నేను చెప్పేదే వేదం కాదు… ఆలోచించి, పరిణతితో ఓటు వేయండి : సీఎం కేసీఆర్ పిలుపు
హాలియా సభ జరగకూడదని కొందరు పన్నాగం పన్నారని, మీరు, నేను కలవకుండా కొందరు చేయని ప్రయత్నమంటూ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది తలాతోక లేని వ్యవహరమని, ఎవరైనా సభలు పెట్టుకొని, ప్రజల్లోకి వెళ్లవచ్చని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి, మంచి చెడ్డలు చెప్పి, తమకు ఓటు వేయమని అడుగుతారని, ఇది దేశ రాజకీయాల్లో కూడా ఉందని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానితో సహా అందరూ విశేషంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియా సభలో ప్రసంగించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని, పరిణతితో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు వేసే ముందు న్యాయం ఎవరి వైపు ఉందో ఆలోచించాలని కోరారు. నాగార్జున సాగర్‌లో సంక్షేమ పథకాలు అందడం లేదా? పైరవీలు లేకుండా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.
‘‘నేను చెప్పేదే వేదం అనుకోకుండి. గ్రామాల్లోకి వెళ్లి చర్చ పెట్టండి. ఆపై ఆలోచనతో, పరిణతితో ఓటు ఇవ్వాలి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. మన విచక్షణ ఉపయోగించాలి. గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు పితికితే పాలు రావు… ముండ్ల చెట్టు పెట్టి పండ్లు కాయమంటే కాయవు. పండ్ల చెట్లు పెడితేనే పండ్లు కాస్తాయ్. ఈ ప్రకారమే యోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎవరు గెలిస్తే మంచిదో, ఎవరు గెలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో మీరు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలి.’’అని సీఎం పిలుపునిచ్చారు. నోముల నర్సింహ్మయ్య వారసుడిగా ప్రజలకు తగు రీతిలో సేవ చేస్తాడన్న నమ్మకంతోనే నోముల భగత్‌ను రంగంలోకి దింపామని స్పష్టం చేశారు. మిత్రుడు నోములను కోల్పోవడం చాలా బాధాకరమని, వామపక్ష పార్టీలో ఉంటూ అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో ఆయన కుమారుడు భగత్ గాలి బాగానే ఉందని, భగత్‌కు కురిపించే ఓట్లలాగే నెల్లికల్ లిఫ్ట్‌కు నీళ్లు కూడా దుంకుతాయని హామీ ఇచ్చారు. తిరుమలగిరి సాగర్ లిఫ్ట్‌ను భిక్షమెత్తైనా సరే, ఒకటిన్నర ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. నందికొండ మున్సిపాలిటిలో ఉన్న ఇళ్ల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు.. అలాగే నాగార్జున సాగర్‌కు డిగ్రీ కళాశాలను కూడా మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ప్రత్యర్థి జానారెడ్డిపై కేసీఆర్ సెటైర్లు
హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్‌కు జానారెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. జానారెడ్డి మాట్లాడితే 30 ఏళ్ల చరిత్ర అని అంటారని, 30 ఏళ్లలో నాగార్జునసాగర్‌కు డిగ్రీ కాలేజీ తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదలను పట్టించుకోలేదని మండిపడ్డారు. నందికొండ మున్సిపాలిటీని జానారెడ్డి అనాథ చేశారని మండిపడ్డారు.
సీఎం పదవి ప్రజల భిక్ష…..
తనకు సీఎం పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష కాదని, సీఎం పదవి అనే భిక్షను ప్రజలిచ్చారని సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్లు, ఉద్యమం మొదలు పెట్టిన నాడే డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా ఎగరేశానని ప్రకటించారు. వెనక్కి తిరగనని, అలా చేస్తే రాళ్లతో కొట్టమని చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా వదిలేశామని, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఏ రోజు కూడా నోరు విప్పలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పదవు ల కోసం తెలంగాణను ఆంధ్రవారికి వదిలిపెట్టారని, తాము మాత్రం తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టామని పోల్చి చెప్పారు.
తెలంగాణను కాంగ్రెస్సే నాశనం చేసింది : కేసీఆర్
అరవై ఏండ్ల పాలనలో తెలంగాణను కాంగ్రెస్ నేతలు నాశనం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ 200 రూపాయల పెన్షన్ ఇస్తే, తాము ఆసరా పెన్షన్ల కింద ఒక్కో లబ్ధిదారుడికి 2016 రూపాయలను ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి అమలు చేస్తున్నామన్నారు. ఇవన్నీ గతంలో ఉండేవా? అంటూ ప్రశ్నించారు. గతంలో రైతు చనిపోతే పరిహారం ఇచ్చే విషయంలో కూడా దారుణాలు జరిగాయని కేసీఆర్ దొప్పిపొడిచారు. గతంలో కరెంట్ సమస్య ఉండేదని, రైతులకు నాణ్యమన 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు.













