వనజీవి రామయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన పర్యావరణ సామాజిక కార్యకర్త పద్మశ్రీ వనజీవి రామయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రామయ్య ఆర్యోగపరిస్థితిపై కేర్ ఆసుపత్రుల గ్రూప్ చైర్మన్ డా.సోమరాజును వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు, రామయ్యతో మాట్లాడి యోగక్షేమాలపై ఆరా తీశారు. మొక్కల పెంపకానికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్న తీరును అభినందించిన ఆయన కుటుంబానికి రూ.5లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు చంద్రబాబుకు రామయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రామయ్య ఒక మొక్కను బహుకరించారు. చంద్రబాబు వెంట భార్య భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.













