న్యాయ వ్యవస్థ ఒక్కరి కోసం కాదు.. సమాజం కోసమే: జస్టిస్ రమణ
న్యాయ వ్యవస్థ ఒక్కరి ప్రయోజనాల కోసం పనిచేయదని, సమాజం, ప్రజలందరి సంక్షేమమే న్యాయవ్యవస్థకు ముఖ్యమని జస్టిస్ ఎన్వీ.రమణ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మతో కలిసి జిల్లా కోర్టుల ప్రారంభోత్సవంలో సీజేఐ ఎన్వి రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఒక అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించుకున్న అనేక మంది ఉద్యమకారులు, మేధావులు, ప్రత్యేకించి న్యాయవాద మిత్రులకు అభినందనలు తెలిపారు. అన్ని వర్గాల వారు మహోన్నత ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నారని కొనియాడారు. 8 ఏళ్ల క్రితం ఎన్నో సందేహాలు, ఎన్నో చర్చల మధ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో న్యాయ వ్యవస్థ అభివృద్ధి కూడా ఎంతో కీలకమని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు.
న్యాయవ్యవస్థపై అవగాన లేని వారికి సూచనలు చేస్తున్నా. ఇటీవల కొందరు కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఉన్నత స్థానంలో ఉన్నవారిపై అభాండాలు వేస్తున్నారు. వ్యవస్థను చక్కబెట్టుకోలేని కొందరు కోర్టులను తప్పుబడుతున్నారు. పరిధులు దాటి మాట్లాడితే రాజ్యాంగపరంగా చర్యలు తప్పవు. పరిధులు దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే. పరిధులు దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యం. నిష్పక్షపాత, బలమైన, స్వేచ్ఛాయుత, న్యాయవ్యవస్థ అవసరం అని అన్నారు.













