వెండితెర గ్లామర్…
తెలుగు రాష్ట్రాల్లో పార్టీబలోపేతం కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో పార్టీని శక్తిమంతం చేసేందుకు .. ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇంచార్జ్ లను సైతం నియమించింది. అంతేకాదు.. త్వరలోనే తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్తరాది ఎమ్మెల్యేలు తిరిగి.. అక్కడి రిపోర్టును హైకమాండ్ కు అందించనున్నారు. మరోవైపు ఇదే సమయంలో సినీగ్లామర్ ను పార్టీ అభ్యున్నతి కోసం వినియోగించుకోవాలన్న తలంపులో ఉంది కమలం పార్టీ.
ఇప్పటికే బీజేపీలో పలువురు సినీనటులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో సీనియర్ నటి విజయశాంతి.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి హోదాలో క్రియాశీలకంగా ఉన్నారు. మరో నటి జీవిత ఆ పార్టీ తరపున తిరుగుతున్నారు. తాజాగా జయసుధ కాషాయ కండువా కప్పుకున్నారు. నటుడు బాబుమోహన్ .. బీజేపీలో కొనసాగుతున్నారు. ఎన్నికల ముంగిట్లో మరికొంత మంది నటుల్ని పార్టీలోకి ఆహ్వానించి సినీ గ్లామర్ అద్దే ప్రయత్నాల్లో కాషాయ పెద్దలు ఉన్నట్టు సమాచారం.
ముఖ్యంగా బాహుబలి ఫేమ్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ .. పార్టీకి అందుబాటులో ఉన్నట్లే లెక్క. ఎందుకంటే ఆయన గతంలో పెదనాన్న కృష్ణంరాజుతో వెళ్లి.. పార్టీ పెద్దలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి తోడు గతంలో హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ తోనూ భేటీ అయ్యారు. హీరో నితిన్ ను కలిశారు. అయితే అదంతా పార్టీకి ఒక పాజిటివ్ వైబ్‌ని తీసుకొచ్చే ప్రయత్నమేనని తర్వాత వివరణలు వచ్చాయి. ఈ పరిణామాలతో… సినీ ప్రముఖులను టచ్ చేస్తే తెలంగాణలో తమకు ప్లస్ అవుతుందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు ప్రచారం మొదలైంది.
అయితే పార్టీలో చేరినవారికి ఎలాంటి ఆఫర్లిస్తున్నారన్న అంశంపైనా చర్చ జరుగుతోంది. వచ్చేవారు కచ్చితంగా టికెట్ ఆశించి వచ్చినట్లైతే.. తర్వాత వారికి టికెట్ ఇవ్వకుంటే పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారవుతాయి. ఇప్పటికే రాములమ్మ తన సేవల్ని .. హైకమాండ్ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఉన్నవాళ్లనే సరిగ్గా ఉపయోగించుకోకుండా మరికొంతమందికి పార్టీ కండువా కప్పితే ఏం లాభముంటుందని … మరికొందరు కార్యకర్తలు, నేతలు భావిస్తున్నారు.
సినీతారలతో సభలు పెడితే జనం చూసేందుకు పెద్దసంఖ్యలో స్వచ్చందంగా వస్తారు. అందులో సందేహం లేదు. కానీ ఓటేస్తారా అంటే అనుమానమే. ఎందుకంటే జనసేనాని పవన్ సభలకు అభిమానులు, కార్యకర్తలు తండోపతండాలుగా వస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో పవన్ .. గెలవలేకపోయారు. అదీ అభిమానం వేరు, పాలిటిక్స్ వేరు.. ఈ విషయంలో ఓటర్లు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇంకా క్లారిటీ రావాల్సింది పార్టీలకే అని కొందరు రాజనీతి విశ్లేషకులు చెబుతున్నారు.













