హైదరాబాద్ జియాగూడలో అరుదైన ఘట్టం
దళిత భక్తుడిని ఓ ప్రధానార్చకుడు తన భుజాలపై కూర్చోబెట్టుకుని ఆలయ ప్రవేశం చేయించిన అరుదైన ఘట్టం హైదరాబాద్‌లో ఆవిష్కృతమైంది. జియాగూడలోని చారిత్రక రంగనాథస్వామి దేవస్థానం ఇందుకు వేదికైంది. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధానార్చకులు సి.ఎస్. రంగరాజన్, రంగనాథస్వామి దేవాలయ వ్యవస్థాపక ట్రస్టీ ఎస్.టి.చారి, ఆలయ నిర్వాహకులు శృంగారం శేషాచార్యులు, అర్చకులు రాజగోపాలాచార్యులు, బద్రిచార్యులు, వంశీ తదితరుల నేతృత్వంలో మునివాహన సేవా మహోత్సవం పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌కు చెందిన దేవీ ఉపాసకులు, దళిత భక్తుడైన ఆదిత్యపరాశ్రీని రంగరాజన్ తన భుజాలపైకి ఎక్కించుకుని ఆలయంలోకి మోసుకుని తీసుకెళ్లి శ్రీరంగనాథస్వామి దర్శనాన్ని కల్పించారు. పండితుల మంత్రోచ్ఛారణలు, అన్నమాచార్య కీర్తనలు, మంగళ వాయిద్యాల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.













