శంషాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన సీఎస్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు ప్రారంభం కావడంతో అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విమానాశ్రయాన్ని సందర్శించారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా నిలిచిపోయిన విమాన ప్రయాణాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొందరు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఉన్నఫళంగా కొన్ని విమానాలను రద్దు చేయడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నట్టు మరికొందరు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సీఎస్ సోమేశ్ కుమార్ ఇక్కడికి వచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో విమనాశ్రయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సీఎస్ తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారిని, హైదరాబాద్ నుంచి వెళ్లే ప్యాసింజర్ల టెంపరేచర్‌ను పరిశీలిస్తున్నారని తెలిపారు. ప్యాసింజర్‌ను టచ్ చేయకుండా సెన్సార్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని కరోనా పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నామని చెప్పారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్ లేదని తెలిపారు.













