మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి : సీఈవో
నల్గొండ జిల్లా పరిధిలోని మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నవంబరు 3న జరగనున్న పోలింగ్‌కు సంబందించి రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 5,686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నప్పటికీ, కేవలం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 298 ఉన్నాయన్నారు. అర్బన్‌లో 35, రూరల్‌లో 263 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు.
మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఓటరు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. ఆన్లైన్లో కూడా ఓటర్లు స్లిప్లును డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. తొలిసారి కొత్త నమూనా ఓటరు కార్డులన పంపిణీ చేశామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుందని పేర్కొన్నారు. 3,366 పోలీసు సిబ్బందితో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గం పరిధిలో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎస్‌ఎంఎస్‌లపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా నెట్వర్క్ ప్రొవైడర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నియమ నింబంధలను కచ్చితంగా పాటించి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహరించాలని కోరారు.













