కోట్లాది జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు ఎన్టీఆర్
రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్వీటర్ వేదికగా ఎన్టీఆర్ సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిన నందమూరి తారకరామారావు దూరమై 25 సంవత్సరాలు గడిచినా ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ల ముందే కదులాడుతున్నట్టు ఉందన్నారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన గొప్ప నేత ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. పేదలకు ఆహార, నివాస భద్రత, కట్టుకోవడానికి మంచి వస్త్రం అందించి సంక్షేమ పాలనకు ఆద్యుడయ్యారన్నారు. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్కు అందించే అసలైన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు.













