తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం : చంద్రబాబు
తెలుగు జాతి అభివృద్ధి కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని, తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ పుట్టిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు.
ఆర్థిక అసమానతలు పోయే వరకు టీడీపీ పనిచేస్తూనే ఉంటుందన్నారు. పాలనను పేదవాడి ఇంటిముందుకు తెచ్చి, రాజకీయాలకు కొత్త అర్థం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. తెలంగాణలో ఇరిగేషన్ అభివృద్ధికి, హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి నాంది పలికింది టీడీపీ అని అన్నారు.













