ఇప్పటికే వారిని హెచ్చరించాం.. ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోం
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ కొత్త పనులకు కేంద్రం మోకాలడ్డుతోందని తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశంలోని చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో రైళ్ల అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరు చేస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరానికి మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతోందని అన్నారు. హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోమని, ఇప్పటికే వారిని హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామన్నారు. మెట్రోలో ఏడీఎస్ ఉండాలన్న నిర్ణయం కాంగ్రెస్ హయాంలోనిదని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికి తెలుసు. పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. హైదరాబాద్లో రూ.985 కోట్లతో నాలాల అభివృద్ధి చేపడుతున్నాం అన్నారు. వ్యూహాత్మక నాలాలా అభివృద్ధి కార్యక్రమం ఎస్ఎన్డీపీలో భాగంగా నగరం నలుమూలలల మురుగునీటి వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. తొలిదశలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చాం. కొన్ని పనులు పూర్తి కావడంతో ఎల్బీనగరలోని కొన్ని కాలనీల్లో గత వర్షకాలంలో ముంపు సమస్య కొంత మేకు తగ్గిందని అన్నారు.













