కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సిసిఎంబి రెడీ
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న సిసిఎంబి (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)లో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అవసరమైన పరికరాలను, సిబ్బందిని సిద్ధంచేసుకొని కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు సిసిఎంబి సన్నాహాలు చేస్తోంది. జీవశాస్త్ర (లైఫ్‌సైన్సెస్) పరిశోధనల్లో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన సిసిఎంబిని కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించుకొనేందుకు అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల నిర్వహణకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని, కేంద్రం నుంచి అనుమతి రాగానే కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా తెలిపారు.
ఈ విషయమై ఇప్పటికే వైద్యశాఖతోపాటు గాంధీ, ఉస్మానియా దవాఖానాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని, పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా 20 మంది నిపుణులను రంగంలోకి దింపనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం సిద్ధంచేసిన అత్యాధునిక ఆర్టీపిసిఆర్ (రియల్ టైమ్ పాలిమెరెస్ చైన్ రియాక్షన్) పరికరాలను సిద్ధం చేశామని, వీటిద్వారా కేవలం రెండుగంటల వ్యవధిలోనే 100 మందికి పరీక్షలు నిర్వహించగలుగుతామని, ఈ విధంగా రోజుకు 1,000 మందికిపైగా పరీక్షలు నిర్వహించవచ్చని ఆయన వివరించారు.













