పసుపు బోర్డుపై కేంద్రం కీలక నిర్ణయం
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పైస్ బోర్డు డివిజన్ కార్యాలయాన్ని రీజనల్ హోదా కార్యాలయంగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్లో ఎక్స్టెన్షన్ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. డైరెక్టర్ స్థాయి అధికారి ఆ కార్యాలయాన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. తక్షణమే బోర్డు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. మిర్చి, పసుపు, సుగంధ ద్రవ్యాల అమ్మకాలు, కొనుగోలుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు గోయల్ తెలిపారు. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయని పేర్కొన్నారు. పసుపు నాణ్యత, దిగుబడి పెంచే విషయంపై బోర్డు పనిచేస్తుందన్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు సహకరిస్తుందని రైతులకు అంతర్జాతీయ కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందన్నారు. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను తాము కల్పించామని పీయూష్ గోయల్ తెలిపారు.













