నాలుగు జాతీయ రహదారులకు కేంద్రం అనుమతి
తెలంగాణకు మరో నాలుగు జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఒకదానిని నాలుగేళ్ల క్రితం, మిగతా మూడిరటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. తాజాగా వాటి పనులు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది. వీటికి టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఉన్న ఈ రోడ్లు జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా.. అవసరమైన చోట్ల నాలుగు వరుసలుగా, మిగతా ప్రాంతాల్లో 10 మీటర్లు వెడల్పుగా మారనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్రం రాష్ట్రానికి విరివిగా జాతీయ రహదారులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల సగటు ప్రతి వంద కిలోమీటర్లకు 3.02 కిలోమీటర్లుకాగా.. ప్రస్తుతం తెలంగాణ లో జాతీయ రహదారుల సగటు 3.44 కిలోమీటర్లుగా ఉంది. కొత్త రోడ్లతో ఈ సగటు మరికొంత పెరగనుంది. కొత్తగా అభివృద్ధి చేయనున్న నాలుగూ కీలకమైనవే. ఇందులో జనగామ`దుద్దెడ మధ్య ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం నాలుగేళ్ల క్రితమే జాతీయ రహదారిగా గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసి పంపగా తాజాగా పనులకు అనుమతి మంజూరు చేసింది. 45.5 కిలోమీటర్ల ఈరోడ్డు నిర్మాణానికి రూ.423 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇక గతేడాది జాతీయ రహదారుల హోదా దక్కించుకున్న మెదక్-సిద్దిపేట, సిద్దిపేట-ఎల్కతుర్తి, వలిగొండ-తొర్రూరు రోడ్లకు కూడా అనుమతులు వచ్చాయి. వీటి డీపీఆర్లను పరిశీలించిన కేంద్రం పనులకు పచ్చజెండా ఊపింది.
6 వరుసల హైవేల ఏర్పాటు
గతంలో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులుగా ఉన్న కొన్నింటిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ రహ దారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ వాటిని ఆరు వరసల జాతీయ రహదా రులుగా అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి ఇటీవల డీపీఆర్లు రూపొందించి పంపగా, కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు వాటికి క్రమంగా టెండర్లు పిలుస్తూ ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభించబోతోంది. ఇంతకాలం నగరంలో మినహా, వెలుపల ఆరువరసల రోడ్లు పెద్దగా పరిచయం లేదు. కీలక రహదారులు కావటంతో, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకపోవటం, ప్రమాదాలు లేకుండా వాహనాలు వేగంగా గమ్యం చేరటం లక్ష్యాలుగా వీటిని ఆరు వరసలకు అభివృద్ధి చేయనున్నారు.
మరోవైపు దేశంలో ఉత్తర`దక్షిణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ కొత్తగా ఎక్స్ప్రెస్వేలను కేంద్రం అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్లోని సూరత్ నుంచి చెన్నై వరకు యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే ను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని పట్టణాల మధ్య ఎకనమిక్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో ఒకటి 280 కి.మీ. నిడివి గల మహారాష్ట్రలోని అక్కల్కోట్ పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు వరకు నిర్మించే కారిడార్. ఇందులో కర్ణాటక`తెలంగాణ సరిహద్దులో రాయచూర్`గద్వాల్ రోడ్డు నుంచి జూలెకల్ గ్రామం వరకు ఒక ప్యాకేజీగా, అక్కడి నుంచి కర్నూలు వరకు రెండో ప్యాకేజీగా ఇప్పుడు టెండర్లు పిలిచారు. రూ.1,870 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంది. దీంతో దాన్ని ప్యాకేజీలుగా చేసి ఆరు వరసల రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్నుంచి వికారాబాద్ రోడ్డుపై పరిగి మలుపు సమీపంలో ఉండే మన్నెగూడ కూడలి వరకు 45.5 కి.మీ. మేర రోడ్డును నాలుగు వరసలు గా నిర్మించనున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్లలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్-నిజామాబాద్ జాతీయ రహదారిపై నగర శివారులో కొత్త కాలనీలు, వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా వెలుస్తుండటంతో కొన్నేళ్లుగా ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దీంతో నగర శివారులోని బోయిన్పల్లి నుంచి మేడ్చల్ దాటిన తర్వాత కల్లకల్ వరకు రోడ్డును ఆరు వరసలుగా విస్తరించనున్నారు. దీన్ని రెండు ప్యాకేజీలుగా చేసి వెడల్పు చేయనున్నారు.













