డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాజధానిలో రక్షణ రంగ ఎకో సిస్టమ్స్‌ను దష్టిలో పెట్టుకొని ఇక్కడ డిఫెన్స్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటుచేయాలని గతంలో రక్షణశాఖకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు లేఖరాశారు. ఈ మేరకు టీ హబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటుచేసేందుకు సానుకూలంగా ఉన్నామని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం మంత్రి కేటీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడెక్స్) పథకంలో భాగంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నామని తెలిపారు. ఐడెక్స్ పథకంలో భాగంగా రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఎమ్మెస్ఎంఈ, స్టార్టప్స్, వ్యక్తిగతంగా ఆయా రంగాల్లో పరిశోధన సంస్థలకు, విద్యార్థులకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు సమకూర్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. టీ హబ్ కేంద్రంగా ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ముందుకురావడంపై మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. టీహబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యుబేషన్ ఏర్పాటుచేస్తే ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. టీ హబ్ రెండోదశ భవనంలో ప్రత్యేకంగా రక్షణశాఖ ఇంక్యుబేటర్‌కు స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు.













