హైదరాబాద్ లో డిఫెన్స్ ఇంక్యుబేటర్
హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణశాఖ సానుకూలంగా స్పందించిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. టీహబ్ కేంద్రంగా దీని ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఇన్నొవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడెక్స్) పథకంలో భాగంగా నెలకొల్పేందుకు ఆసక్తిగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఈ పథకం కింద రక్షణ, ఏరోస్పేస్ రంగం లోని పరిశోధనల ప్రోత్సాహంతో పాటు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధకులు, పరిశోధన సంస్థలు, విద్యార్థులకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు అందుతాయని లేఖలో వివరించారన్నారు.
హైదరాబాద్‌లో రక్షణ రంగ పరిశ్రమలు, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంక్యుబేటర్ మంజూరు చేయాలని గతంలో లేఖ రాసినట్లు కేటీఆర్ తెలిపారు. దశాబ్దాలుగా నగరంలో రక్షణ, వైమానిక రంగంలో పలు సంస్థలు పనిచేస్తున్నాయని, డీఆర్డీవోతో పాటు రక్షణ సంస్థలు, 25 ప్రైవేటు సంస్థలున్నాయని పేర్కొన్నారు. టీహబ్ కేంద్రంగా ఇన్క్యుబేటర్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలందిస్తామని తెలిపారు. రెండోదశ టీహబ్ భవనంలో ప్రత్యేకంగా రక్షణ ఇన్క్యుబేటర్కు స్థలాన్ని కేటాయిస్తామని, తద్వారా ఈ రంగంలోని ప్రోటో టైపింగ్, టెస్టింగ్, నైపుణ్య శిక్షణ అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.













