తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం శాసనసభ్యుల బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మెజార్టీ ఉంది. రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుండటంతో అవి కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.













