‘సీబీఎన్ గ్రాటిట్యూడ్’ కాన్సర్ట్ విజయవంతం
చంద్రబాబు విజన్‌తో నిర్మించిన సైబర్ టవర్స్‌కు 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపేందుకు సీబీఎన్ గ్రాటిట్యూడ్ పేరిట గచ్చిబౌలి స్టేడియంలో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది ఐటీ ఉద్యోగులు, టిడిపి శ్రేణులు, అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరై చంద్రబాబుకు సంఫీుభావం తెలిపారు. సీబీఎన్ వెంటే తాము అంటూ నినాదాలతో స్టేడియం హోరెత్తింది. చంద్రబాబు నాయుడు అంటే ఒక చరిత్ర అని.. తెలుగుజాతి ఉన్నంత వరకూ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రపంచంలోని తెలుగువారు మరిచిపోరంటూ సీబీఎన్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఐఎస్బీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటివాటికి పునాదులు వేసిన చంద్రబాబును దార్శనికుడైన నాయకుడిగా ప్రపంచం ఎప్పుడో గుర్తించిందని పేర్కొన్నారు.
హైటెక్ సిటీ అనగానే తెలుగువారందరికీ గుర్తొచ్చే ‘సైబర్టవర్స్’ నిర్మాణం జరిగి 25 ఏళ్లవుతున్న (రజతోత్సవం) సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో ‘తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచీ అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. సీబీఎన్ అభిమానులు, ఐటీ ఉద్యోగులు, గ్రేటర్‌లోని పలుప్రాంతాల నుంచి యువత భారీ సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. సుమారు 4 గంటలపాటు స్టేడియం పరిసరాలు సీబీఎన్ నినాదాలతో మారుమోగాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్ రాక్‌బ్యాండ్ నిర్వహించిన పాటల ప్రదర్శన పత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, ఐటీ ఉద్యోగులు, సీనియర్ సిటీజన్స్, యువకులు.. సీబీఎన్ వెంట తాముంటామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, జగదీశ్వర్‌గౌడ్, నిర్మాత బండ్లగణేశ్, ప్రముఖ జర్నలిస్ట్ కందుల రమేశ్, టీడీపీ నేత మహాసేన రాజేశ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ప్రతినిధులు ఫణిశ్రీ, చల సాని సుధీర్, కంకణంపాటి సుధాకర్, సుమన్, సుధీర్ దొడ్డ, బండి రాజా, చదలవాడ కిరణ్, పాతూరి సుమిత తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1200 మంది వాలంటీర్లు సేవలందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టి కొన్ని శక్తులు ఆనందం పొందుతున్నాయి. కానీ, జైల్లో ఉన్నా.. చంద్రబాబు ప్రతిష్ట మరింత పెరిగింది. ఆ శక్తి ఏంటో ఇప్పుడు తెలిసి వస్తోంది’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు మద్దతుగా భారీ సంఖ్యలో గచ్చి బౌలి స్టేడియంకు తరలి వచ్చిన యువతే దీనికి నిదర్శనమన్నారు. మాగంటి మురళీ మోహన్… చంద్రబాబును జైల్లో పెట్టడంతో తెలుగు ప్రజల గుండెలు మండిపోతున్నాయి. అరాచక శక్తులకు గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో టీడీపీ నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ కావడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గచ్చిబౌలిలో చంద్రబాబుకు కృతజ్ఞతతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి సభకు హాజరైన అభిమానులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబు కు తిరుగులేని మద్దతు ఇచ్చారని.. ఈ సభ ద్వారా అభిమానులు తమ ప్రియతమ నేత పట్ల చూపించిన ప్రేమ, గౌరవం తనను కదిలిచిందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. విజనరీ నేతగా పేరు పొందిన చంద్రబాబును జైలులో పెట్టినా రాజకీయంగా తాము దృఢంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పెట్టిన కేసులు రాజకీయ కక్షతోనే పెట్టారని తాము విశ్వసిస్తున్నామని.. అనివార్య కారణాల వల్ల తాను ఈ సభకు హాజరు కాలేకపోయినా అభిమానులు చూపించిన నమ్మకానికి రుణపడి ఉంటానని.. చంద్రబాబుకు ఇది కొండంత బలాన్ని ఇస్తుందని బాలయ్య పేర్కొన్నారు.
చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించిన కాన్సర్ట్‌కు లక్షలాది మంది తరలి రావడంపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘హైటెక్ సిటీ సృష్టికర్తా.. ఈ విశ్వనగరాన్ని నిర్మించిన మీ కోసం లక్షలాదిమంది తరలిరావడాన్ని చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నాను. మీతో ప్రయాణం చేయడం చాలా గర్వంగా ఉంది. మీరు ఆరోగ్యంతో, నూతనశక్తితో త్వరగా బయటకు రావాలని ఏడుకొండలవాడిని ప్రార్థిస్తున్నాను.’’ అని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలో కూడా సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమం: సతీష్ వేమన
అమెరికాలో మేమంతా ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలే కారణమని ఎన్నారై టీడిపి నాయకుడు సతీష్ వేమన తెలిపారు. గచ్చిబౌలిలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐటీరంగంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు నేడు ఎంతోమందికి అమెరికాలో ఐటీ ఉద్యోగాలు లభించేలా చేశాయన్నారు. అలాంటి ఆయనకు నిన్న బెంగుళూరులో, నేడు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు వలంటరీగా వచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఇదే విధంగా అమెరికాలో కూడా అదీ రాజధాని వాషింగ్టన్ డీసిలో మేము కూడా చేయనున్నట్లు సతీష్ వేమన ప్రకటించారు. వాషింగ్టన్‌డీసిలో జరిగే సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో అమెరికాలో ఉన్న ఐటీ ఉద్యోగులంతా పాల్గొనాలని ఈ వేదిక మీద నుంచే కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.













