నిజామాబాద్ ఐటీ హబ్ లో.. గ్లోబల్ లాజిక్ సంస్థ
నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీల ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుచుతున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్‌లో రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3,000 మంది పనిచేస్తున్నారు. నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేయడంపై ఈ నెల మొదటి వారంలో ఆ సంస్థ ప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో చర్చలు జరిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత ఇచ్చిన హామీ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్‌ను ఇటీవల సందర్శించారు.
అనంతరం కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదించగా కాలిఫోర్నియాలోని వారి ప్రధాన కార్యాలయం అనుమతులు ఇచ్చింది. కల్వకుంట్ల కవితతో సమావేశమైన కేవలం 29 రోజుల్లోనే సంస్థ ఏర్పాటు కావడం విశేషం. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ లాజిక్ సంస్థ నిజామాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని స్పష్టం చేశారు. ఐటీ అభివృద్ధి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు. ఇప్పటికే అనేక మందికి ఉద్యోగాలు లభించాయని, రెండు జాబ్ మేళాలు నిర్వహించామని తెలిపారు.













