తెలంగాణలో రాజకీయ ‘భూ’కంపం!
తెలంగాణ రాజకీయాల్లో భూములు, ఆస్తుల అంశం మరోసారి అగ్గిరాజేసింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆస్తులు, ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల చుట్టూ ఇప్పుడు తీవ్ర రాజకీయం నడుస్తోంది.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఆస్తుల మూలాలపై నిలదీశారు. కేసీఆర్ 2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్లో తనకు ఎలాంటి వ్యవసాయ భూమి లేదని ప్రకటించారని, కానీ ఆ తర్వాత ఆయన ఆస్తులు వేల కోట్ల రూపాయలకు ఎలా పెరిగాయని పొంగులేటి ప్రశ్నించారు. అలాగే 2009 ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్ కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే ఉన్నట్లు డిక్లేర్ చేశారని, మరి వందల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కార్యకర్తలు అప్పులపాలైతే… కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులను కూడగట్టుకుందని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
మంత్రి పొంగులేటి విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పుట్టినప్పటి నుంచి కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాల ఆస్తులపై సిట్టింగ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. తప్పు జరిగినట్లు తేలితే ఏ చట్టపరమైన చర్యలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్‌పై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా ఆ ప్రాపర్టీ విస్తీర్ణం 1,000 ఎకరాలు కాదని, కేవలం 67 ఎకరాలేనని అంగీకరించారని కేటీఆర్ గుర్తుచేశారు. మిగతా 933 ఎకరాలను గుర్తించి చూపాలని సవాల్ చేస్తూ, కేసీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో జీఓ 58, 59 కింద దీర్ఘకాలిక ఆక్రమణలను మాత్రమే తాము క్రమబద్ధీకరించామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో రెవిన్యూ యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ఫాంహౌస్ పరిసరాల ఫైళ్లను పరిశీలిస్తోంది. కేసీఆర్ పరిధిలో ఎంత భూమి ఉంది. అది ఎవరెవరిపేరుమీద రిజిస్టర్ అయింది. రిజిస్టర్ కాకుండా కేసీఆర్ ఆక్రమణలో భూమి ఏమైనా ఉందా..? ఉంటే ఎంత ఉంది..? లాంటి అంశాలన్నింటినీ రెవిన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. 30 రోజుల్లోపే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెవిన్యూ యంత్రాంగం ఆగమేఘాలపై రంగంలోకి దిగింది.
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై రెవిన్యూ యంత్రాంగం ఇచ్చే నివేదిక కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఓ వైపు పక్కా ఆధారాలతో దాడి చేయడంతో బీఆర్ఎస్ దాన్ని కవర్ చేసేందుకు ఆపసోపాలు పడుతోంది. మరి భూముల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ పోరు రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.








