సిరిసిల్ల కోసం ఎంతకైనా ఉద్యమిద్దాం: కేసీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఉండాలంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్యత తనదని, అందుకోసం తనకు బలాన్నివ్వాల్సిన బాధ్యత జిల్లా ప్రజలదేనని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం నాడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల పట్టణానికి చేరుకుంది. ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వినోద్‌కుమార్ కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాను కాపాడుకోవాలన్నా, గోదావరి జలాలను కాపాడుకోవాలన్నా, మన నేత కార్మికుల బతుకులు బాగుండాలన్నా.. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఒకప్పుడు జిల్లాలో ఎటు చూసినా చేనేత కార్మికుల ఆత్మహత్యలే కనిపించేవని, దాన్ని అరికట్టేందుకే రూ.50 లక్షలతో ట్రస్ట్ ఏర్పాటు చేసి, అనేక స్కీమ్‌లు పెట్టుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. ‘సిరిసిల్ల కోసం టెక్స్‌టైల్ పార్క్ అడిగితే నరేంద్ర మోదీ ఇవ్వలేదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే పూనుకుని ఉన్నంతలో నేత కార్మికుల బతుకులు మార్చుకున్నాం. బతుకమ్మ చీరలు, రంజాన్ గిఫ్ట్‌లు, స్కూల్ యూనిఫాం కాంట్రాక్టులు ఇచ్చి కాపాడుకున్నాం. నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు సంపాదించుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన సర్కార్ అన్నింటినీ బంద్ చేస్తోంది. నేత కార్మికుల జీవితాలను మళ్లీ చీకట్లలోకి నెట్టేస్తోంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ అందరికీ అండగా ఉండే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించుకోండి. జిల్లా కోసం, జిల్లా ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం’’ అంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు.