బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ వ్యూహం
దేశంలో భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయ పార్టీగా, నేతగా ఎదిగేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు భారతీయ రాష్ట్ర సమితి ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే బలమైన నాయకునిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిందని చెబుతున్నారు. మూడు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్‌తో వేదికను పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ కేసీఆర్ ఇచ్చిన నినాదం ఉత్తరాది నాయకుల మనసులను గెలుచుకొన్నది. ఖమ్మం సభ తర్వాత సీఎం కేసీఆర్‌తో పలు రాష్ట్రాల నేతలు భేటీ అవుతున్నారు.
ఒడిశా పీసీసీ కార్యదర్శి తన పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన మరికొన్ని పార్టీల నేతలు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేతలు కేసీఆర్‌ను వరుసగా కలుస్తున్నారు. మొత్తమ్మీద బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆయా రాష్ట్రాల నేతలతో పాటు వారి పార్టీ క్యాడర్ కూడా బీఆర్ఎస్లో చేరటానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కేసీఆర్‌ను దక్షిణాదినేతగా ఇంతకాలం చూస్తూ వచ్చిన ఉత్తరాది మీడియా, ఖమ్మం సభ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నది. సమాజ్ వాదీ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆప్ అధ్యక్షుడు, ఢల్లీి సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు ఖమ్మం సభలో పాల్గొనడం, లక్షలాది జనం ఆ సభకు హాజరవ్వటంతో ఉత్తర భారతంలోని ప్రముఖ హిందీ, ఉర్దూ దినపత్రికలు ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యమిచ్చాయి.
కేసీఆర్ ఇప్పుడు బిఆర్ఎస్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ముందుగా సరిహద్దు రాష్ట్రాల్లో పట్టు సాధించి దక్షిణాదిలో పాగా వేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే వచ్చేనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభను నిర్వహించి బీఆర్ఎస్ బలాన్ని చాటుకునే దిశగా చర్యలు ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో జన సమీకరణ సమస్య లేకుండా ఉంటుందని, అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ఫలాలు తమకూ కావాలంటూ అనేక సందర్భాల్లో అక్కడి ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నాం దేడ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.అలాగే వచ్చేనెల 17న ప్రతిష్టాత్మక సచివాలయ ప్రారంభోత్సవానికి మూడు రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తున్నందున అదేరోజు పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ రెండు సభలను ఖమ్మం తరహాలోనే విజయవంతం చేసి ఇక పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో ప్రతిరోజూ ఆయన ఎక్కువ సమయం బీఆర్ఎస్ విస్తరణ కోసమే కేటాయిస్తూ, మద్దతు కూడగట్టుకునే క్రమంలో అనేకమంది నేతలకు స్వయంగా ఫోన్ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ అసెంబ్లి సమావేశాల తర్వాత మరింత వేగంతో కార్యాచరణను ముందుకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వరుస పర్యటనలు, సమావేశాలతో మద్దతు కూడగట్టుకోబోతున్నారు. జన సమీకరణకు సన్నాహాలు వచ్చేనెలలో రెండు బహిరంగ సభల లక్ష్యాలను నిర్ధేశించిన తరుణంలో పెద్దయెత్తున జనసమీకరణ చేయడానికి బాద్యులు సిద్ధమయ్యారు. నాందేడ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో నిజాబామాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి జనాన్ని తరలించే ఏర్పాట్లకు సన్నాహాలు మొదలయ్యాయి. నాందేడ్ సభ తర్వాత హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 17న మరో భారీ బహిరంగసభ జరగనున్నందున ఇక్కడ కూడా సన్నాహాలు చేస్తున్నారు. నాందేడ్ సభకు సీఎం కేసీఆర్‌తో పాటు- మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే నాందెడ్‌లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించి చేరికల కోసం కొంత మందిని సంప్రదించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పోటీ-కి సిద్ధంగా ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి మార్చిలో ఎన్నికలు జరిగేలా ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నా, ఇంత తక్కువ సమయంలో ఎన్నికల బరిలో నిలవడం అసాధ్యమని భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేయడం కన్నా పార్టీ బలోపేతం గురించే ఎక్కువగా కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కూడా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పాల్గొన్నారు. అయితే ఖమ్మంలో జరిగిన సభకు మలివిడత కంటి వెలుగు ప్రారంభోత్సవానికి కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను ఆహ్వానించిన సీఎం కేసీఆర్, ఫిబ్రవరి 17న జరగబోతున్న సచివాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీతో భాగస్వాము లుగా ఉన్న ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న నూతనంగా నిర్మించిన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, రaార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తరఫున ఆయన ప్రతినిధి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్ హాజరవుతున్నారు.
ఫిబ్రవరి 17న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు కాంగ్రెస్‌తో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నందున ఈ సభ జాతీయస్థాయి ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలోనే భారత రాష్ట్ర సమితి ఏర్పాటు- ప్రకటన సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తమ మద్దతు ప్రకటించారు. ఇక తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ విలీనానికి ముందుకొచ్చింది. కర్ణాటకలో పాదయాత్రలో ఉన్న సందర్భంగా కుమారస్వామి ఖమ్మం సభకు హాజరు కాలేదు. ఢల్లీిలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖమ్మం సభకు కూడా హాజరయ్యారు. బిఆర్ఎస్కు మద్దతు ఇస్తున్న నాయకులను దృష్టిలో పెట్టుకుంటే దాదాపు దక్షిణాదిలోని రాష్ట్రాలన్నింటిలో బీఆర్ఎస్కు బలం ఉన్నట్లేనని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారాన్ని ఉద్ధృతం చేసేలా, బీజేపీని ఎండగట్టేందుకు అస్త్రశస్త్రాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే బహిరంగ సభలను ఏర్పాటు చేసి విపక్ష నాయకులను ఆహ్వానించి వారితో కలిసి బిజెపిపై యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు.













