తెలంగాణ మోడల్ ను దేశం మొత్తం అమలు : మంత్రి కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అనివార్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోకవర్గ ప్లీనరీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గోల్మాల్ గుజరాత్ కాదు, గోల్డెన్ తెలంగాణ నమూనాను దేశానికి పరిచయం చేసేందుకు బీఆర్ఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారిందే తప్ప. డీఎన్ఏ, జెండా, అజెండా మారలేదని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం అర్రులు చాస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి ఎల్లుండికి 22 ఏళ్లు పూర్తవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నా, తెలంగాణతో తిరిగి వస్తానని ధైర్యంతో చెప్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్. పోరాడి రాష్ట్రాన్ని సాధించిన వారికే అధికారం కట్టబెడితే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు ఓట్లేశారు అని అన్నారు. ఇప్పుడు సిరిసిల్ల ఎక్కడి నుంచి ఏ స్థాయికి అభివృద్ధి చెందిందో మీరే ఆలోచించండి. పక్క నియోజకవర్గాలు, ప్రతిపక్షాలు అసూయ పడే విధంగా సిరిసిల్లను అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇప్పుడు అభివృద్ధి చెందిన తెలంగాణ మోడల్‌ను దేశం మొత్తం అమలు చేయడమే మా పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రధాని మోదీ చేసిన గోల్మాల్ను దేశమంతటికీ వివరించాలి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని మహారాష్ట్ర రైతులు గర్జిస్తున్నారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌ను కనుమరుగు చేసే రోజు త్వరలోనే వస్తుంది అని కేటీఆర్ అన్నారు.













