ఎమ్మెల్సీ కవితకు ఆరుదైన ఆహ్వానం
మహిళా రిజర్వేషన్ చట్టం-ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై లండన్లో ఈ నెల 7న జరగనున్న సదస్సులో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లండన్లోని వెస్ట్ మినిస్టర్ సెంట్రల్ హాల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఎమ్మెల్సీ కవిత కీలకోపన్యాసం చేస్తారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమ తీరుతెన్నులు, మహిళ రిజర్వేషన్ల ద్వారా ఒనగూరే మేలు, చట్టసభల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెంచడం, రాజకీయాల్లో మహిళల పాత్ర వంటి అంశాలపై ఆమె ప్రసంగిస్తారు. అనంతరం అదేరోజు లండన్లోని అంబేడ్కర్ హౌస్ మ్యూజియంను సందర్శిస్తారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అండ్ అలుమ్ని యూనియన్ యూకే నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశం లోనూ కవిత ప్రసంగిస్తారు.













