కారు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎమ్మెల్యే మృతదేహాన్ని పటాన్చెరు ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢోకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది డిసెంబర్లో సికింద్రాబాద్ ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య లిఫ్టులో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ కిందికి పడిపోవడంతో అందులో చిక్కుకుపోయారు. దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాది కాలంలోనే తండ్రి, కూతురు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.













