సెంటిమంటలు
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ సెంటిమెంటు అస్త్రాన్ని బయటకు తీస్తోంది. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రులు.. పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీరుపై సెటైర్లు వేస్తున్నారు. మొన్నటికి మొన్న.. తెలంగాణ వెలుగుతోంటే.. ఏపీలో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయని ఓ బహిరంగసభలో కేసీఆర్ ఆక్షేపించారు. ఇప్పుడు మంత్రి హరీశ్ రావు.. మరో అడుగు ముందుకేసి ఏపీలో పాలకుల తీరుతో రాష్ట్రం వెల్లకిలా పడిందన్నారు.
ఏపీలో నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారు. హైదరాబాద్‌లో రోజూ కర్ఫ్యూ ఉంటుందన్నారు. పరిపాలన చేత కాదు.. విద్యుత్ ఉండదన్నారు. వాటన్నింటినీ పక్కకు నెట్టి తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. తెలంగాణ అభివృద్ధి తెలియాలంటే పక్క రాష్ట్రం వెళ్లి చూడాలి’’ అని హరీశ్‌రావు కామెంట్ చేశారు.
ఓవైపు పక్క రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ.. అది తెలియాలంటే తెలంగాణకు వచ్చి చూడాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇటు నుంచి కేసీఆర్, మంత్రులు విమర్శలకు దిగుతుంటే.. ఆంధ్ర మంత్రులు, నేతలు మాత్రం ఊరుకుంటారా.. వారు ఆటోమేటిక్ గా ప్రతివిమర్శలకు దిగుతారు. అంటే ఇరు ప్రాంతాల్లోనూ సెంటిమెంట్ ను మరోసారి పండించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు.. మరోసారి పొరుగు రాష్ట్రం ప్రసక్తిని బీఆర్ఎస్ నేతలు తెస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అటు.. ఏపీలో జగన్ పరిస్థితి సేమ్.. అక్కడ కూడా విపక్షనేత చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతున్నారు. దీనికి తోడు లోకేష్,జనసేనాని పవన్ యాత్రలు .. రాజకీయ హీట్ పెంచుతున్నాయి. ఈక్రమంలో మరోసారి సెంటిమెంటు రగిలితే, జనం సమస్యల సంగతి పక్కన పెట్టి .. ఓట్లు తమకే వేస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఏపీ విపక్షాలు.. మాత్రం బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు.. సెంటిమెంటు రగిల్చి పరస్పరం మేలు చేసుకునే దృక్పథంతో కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. అయితే ఈసారి సెంటిమెంటు అస్త్రం ఎంతవరకూ పనిచేస్తుందో వేచిచూడాలి.













