రేపు భదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
భదాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ రాముల వారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. దేవాలయం కట్టినప్పటి నుంచి శ్రీసీతారామచంద్ర స్వామివారి కల్యాణం నవాహ్నికంగా నిర్వహిస్తున్నారు. భదాద్రి రామక్షేత్రంలో పాంచరాత్రగమ శాస్త్రోక్తంగా కల్యాణ కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 2వ తేదీన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 3వ తేదీన శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు ఎవరిని అనుమతించడం లేదని, కేవలం ఆలయ పూజారులు మాత్రమే కల్యాణం, పట్టాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రకటించారు. భక్తుల సౌకర్యం కోసం కల్యాణ, పట్టాభిషషేక కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, ప్రజలు ఎవరూ భద్రాచలం రావొద్దని విజ్ఞప్తి చేశారు.













