అమెరికా పర్యటనకు మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి
బోర్లాగ్ అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నెల 22 నుంచి 29 వరకు వీరిద్దరు అక్కడ పర్యటించనున్నారు. పదేళ్ల తెలంగాణ వ్యవసాయరంగ ప్రగతి ప్రస్తానంపై ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు టెర్రీ బ్రాన్ స్టాడ్ ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయంలో సాధించిన పురోగతిని గమనించి బోర్లాగ్ సదస్సుకు తమను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 24 నుంచి 26 వరకు అమెరికాలోని అయోవా రాష్ట్రం డెమోయిన్ నగరంలో జరిగే సదస్సులో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి పాల్గొంటారు. ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీద ఏటా ఈ సదస్సులు జరుగుతాయి. వీటికి ప్రపంచ దేశాల నుంచి 1,200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. మొత్తంగా ఈ నెల 22 నుంచి 29 వరకు జరిగే ఈ పర్యటనలో ఇరువురు మంత్రులతో పాటు ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, తెలంగాణ సీడ్స్ ఎండీ కేశవులు బృందం కూడా పాల్గొననున్నారు.













