ఎమ్మెల్సీ బరిలో బొంతు రామ్మోహన్ !
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బరిలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతురామ్మోహన్‌ను నిలిపే అవకాశం కనబడుతోంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఈ సారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్‌గా ఐదేళ్ళపాటు సమర్ధవంతంగా పనిచేసిన బొంతు రామ్మోహన్ ను నిలిపి ఇంతవరకు ఖాతా తెరవని నియోజకవర్గంలో విజయఢంకా మోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకపోగా, ఈ దఫా ఖచ్చితంగా గెలవాలని కేటీఆర్ పట్టుదలగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు మహబూబ్‌నగర్, రంగారెడి, హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు.
అందరికీ తెలిసిన నాయకునిగా, వివాదరహితుడిగా, అధిష్టానానికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రునిగా, జీహెచ్ఎంసీ మేయర్‌గా పార్టీకి మచ్చలేకుండా మంచి పరిపాలన అందించిన నాయకునిగా గుర్తింపు పొందిన బొంతు రామ్మోహన్ పేరును అనేక అంశాలు పరిశీలించి దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. రంగారెడ్డి, హైదరాబాద్ లలో విద్యార్థినాయకునిగా, ఉద్యమనాయకునిగా గుర్తింపు ఉండగా, విద్యార్థి ఉద్యమంలో ఎబివిపిలో పనిచేసిన సంబంధాలు కూడా గెలుపులో పనికొస్తాయని.. ఇటు టీఆర్ఎస్ బలం, ఇటు ఎబివిపి సంబంధాలతో విజయతీరం చేరుతారని టీఆర్ఎస్ ప్లాన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోనే ఓటర్ల నమోదుకు సంబంధించి షెడ్యూల్, ఎన్నికల తేదీపై సృష్టత రానుండగా, మార్చిలో ఎన్నిక జరగనుంది.













